పేరులో ఏముంది!!

పేరులోనే అన్నీ ఉన్నాయి అని అనుకుంటాం గానీ,కానీ కొన్నిపేర్లలో- పేరుకి దాని అర్ధానికి సంబంధమే లేదు- ప్రస్తుత పరిస్థితుల్లో.

రవితేజ, బ్రహ్మానందాన్ని సినిమాల్లో అంటాడే "ఒరేయ్ నీఫేస్ కి, నీ డైలాగ్ కి ఏమైనా సంబంధ ఉందా" అలాగన్నమాట! బంగారు తెలంగాణలోని భాగ్యనగర్ లోని కొన్ని పేర్లు పరికిద్దాం!!!

(ఇది హాస్యానికి రాసిందే గానీ, మరో ఉద్దేశం మాత్రం కాదు సుమా)

అమీరుపేటను నివసించువారందరు అమీరులు కానట్టే!
ధూల్పేటల వారు దుమ్ము కాదు!
దోమలగూడ అనిన “దోమలే” ఉండునా!
అట్లనిన చాంద్రాయణ గుట్టపై “చంద్రుడేడి”!

సంతోష్ నగరును ఎల్లరు “సుఖముగా” నుండనట్టె!
దిల్సుఖ్ నగరును ఎల్ల జనులు “సుఖముగా నుండరు”!
ఆదర్శ్ నగరున అందరు “ఆదర్శముగ” నుందురా!

ఎర్రగడ్డయందు నివసించు ఎల్లరు “పిచ్చివారలు” కాదె!
అటులనిన బేగం బజార్ ను “బేగములు” కానరారే!

బంజారా హిల్స్ లో “బంజారా” లెటుపోయిరి!

నానక్ రామ్ గూడలో “నానక్ రామ్” జాడ ఏది!

గాంధీనగరున “గాంధీయే” కానరాడు!
సీతాఫల్ మండిలో “సీతాఫలాలు” కొద్దిగానె మిగిలే!
చిలకలగూడలో, చిలుకానగరున “చిలకలేమాయె”!

పద్మారావునగరును - “పద్మలూ లేరు,రావులు” లేరు- ఒక్క శేఖర్ కమ్ముల తప్ప!

చింతల్ లో “చింతలే” కానరావు!
హస్తినాపూరున “కౌరవులే”మాయిరి!
చెర్లపల్లిలో మాత్రం పల్లి పోయి “పెద్ద చెర” అయితే మిగిలింది!

కొత్తపేట ఎప్పుడును “పాతగనే” ఉండు!
అలకాపురిన “అలక”లేమాయె!
ఉప్పుగూడన “ఉప్పు” మాత్రము దొరుకునా!

రాజేంద్రనగరున “రాజేంద్రుడే” లేడాయె!
రెడ్ హిల్స్ నా “ఎర్రకొండలే” కనమాయె!
గోషా మహల్ న ఘోష తప్ప, “గోషాయే” కానరాదు!
షేక్ పేటన “షేకులే” కానరారు!

బౌద్ధనగరు “బుద్ధుడు” సాగర్ పోయి కూర్చున్నాడు!
బాలానగరున “బాలరే” లేరు!
జీడిమెట్లలో- “జీళ్ళు లేవు, మెట్లు లేవు”!
గాజుల రామారంలో “గాజుల మారామే” మచ్చుకి లేదు!
మల్లాపూర్ న ఒక్క “మల్లుడైనా” లేడు!
చైతన్యపురిన “చైతన్యమే” కానరాదు-రణగొని తప్ప!
గడ్డి అన్నారం లో “గడ్డే”లేదు!

అక్బర్ బాగ్ ల “అక్బరెప్పుడు” కనపడలేదు!
కిషన్ బాగ్ న “కృష్ణ కన్నయ్య” కానయే రాడు!
శాస్త్రిపురమున “శాస్త్రు”లెంతమందున్నారు!
అత్తాపూర్ న “అత్తరూ లేదు, అత్తలూ” లేరు!

దత్తాత్రేయనగరున “దత్తన్న” ఉండడు!
మల్లేపల్లిలో ఒక్క “మల్లెను” చూడలేదు!
నల్లకుంటన ఒక్క “కుంటయు” కానరాదు!
మోతీనగర్ లో “మోతీలు” దొరకవు!
లక్డి కా పూల్ లో, “కట్టే లేదు, కట్టెల అడితీ” లేదు!

రాష్ట్రపతి రోడ్డున “రాష్ట్రపతే” లేకపోయే!

ఈస్ట్- -వెస్ట్ మారేడ్ పల్లిలో “మారేడు చెట్లు” మాయమాయె!
ఓల్డ్,న్యూ బోయిగూడలోని “బోయీలందరూ” ఏమాయరో!
కార్ఖానాలో “ఒక్క కార్ఖానా” అయినా మచ్చుకి లేదు!

అశోక్ నగర్ లో “అశోకుడు” లేడు!
హైదర్ గూడాలో “హైదర్” లేడు!
శంకర్ మట్ లో మాత్రం “శంకరుడున్నాడు”!

మరి తిలక్ నగర్ లో “తిలకాలు” పెట్టరే!
బొగ్గులకుంటలో “బొగ్గులే” దొరకవాయె!
నామాలగుండు లో “నామాలు లేవు, గుండ్లు లేవు” నామాల బండ కనపడుతుంది!

ప్యాట్నీ సెంటర్ నుంచి “ప్యాట్నీ” ఎప్పుడో తుర్రుమన్నాడు!
సిఖ్ విలేజి లో “సిక్కులు” పంజాబు పోయారా!
సుల్తాన్ బజార్ లో “సుల్తాన్లు” గాయబ్!

ఎం.ఎల్.ఏ. క్వార్టర్స్ లో “ఎం.ఎల్.ఏల” లాగున!

సెక్రటేరియట్ లో “కె.సి.ఆర్” కనిపించరు అనేది ఎంత సత్యమో, రామోజీ ఫిలిం సిటీ లో “రామోజీ” ఉంటారనేది అంత నిజం!

అప్పుడు సిటీ అంతటికి ఒకే "కోరంటు దవఖానా"-ఇప్పుడు ప్రపంచమే కోరంటు (క్వారంటైన్) అయిపాయె!

ప్రస్తుత పరిస్థితుల్లో భాగ్యనగరవాసులు జాగ్రత్తగా ఉండండి!
మీరెవరు తోపుగాళ్ళు కాదు,ఎలాంటివాళ్ళనయినా కరోనా ఇట్టే దొరకపుచ్చుకుంటోంది తన కబందహస్తాలతోనే కాకుండా దాని వాడికొమ్ములతో; ఇప్పుడు తన పిల్లా-జిల్లాలని కూడా రంగంలోకి దింపినట్టుంది, తస్మాత్ జాగ్రత్త.

భాగ్యనగర్ వాసులే కాదు, దేశ ప్రజలు మొత్తం కూడా
సూచించిన ముందు జాగ్రత్త చర్యలు పాటించండి

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!